భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పలుచోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. సీతారాముల వారి భూముల్లోనూ కొంత భాగం ఆక్రమణలకు గురవుతోంది. ఆలయం వద్ద ఉన్న కొండను కొందరు తవ్వుతుండగా ఈటీవీ భారత్, ఈనాడు బృందం పరిశీలించింది. పైన ఆలయానికి సంబంధించి కాటేజీలు ఉండగా.. కింద కొండను తవ్వుతుండడం వల్ల ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.
కొండను తవ్వడం చూసిన ఆలయ అధికారులు.. పనులను తాత్కాలికంగా ఆపివేశారు. ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ కొండలో చాలా భాగం తవ్వి.. ఆక్రమణదారులు కబ్జా చేశారు. ఇదే తరహాలో రోజూ జరుగుతున్నప్పటికీ అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే తీసుకుంటున్నారని పలువురు తెలిపారు.
కొండ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తవ్వటం వల్ల పైన ఉన్న కాటేజీలు బలహీనపడి వర్షాకాలంలో కుంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆలయ, రెవెన్యూ అధికారులు స్పందించి.. రామాలయం కొండ చుట్టూ జరుగుతున్న తవ్వకాలను ఆపి భూములు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా దృష్ట్యా ఇంటర్ కళాశాలలు మూసివేత