Pest In Cotton Crop: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ ఏడాది సీజన్ మొదటి నుంచే వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సకాలంలోనే పత్తి పంటను సాగు చేశారు. ప్రభుత్వం పత్తి సాగు చేయాలంటూ అన్నదాతలకు సూచనలివ్వడం, ఆశించిన ధర పలుకుతుండటంతో.. ఎక్కువ శాతం మంది తెల్ల బంగారం పండించేందుకే మొగ్గుచూపారు. గత సీజన్‌లో మిర్చి సాగు చేసిన రైతులు కూడా ఈసారి పత్తి వైపు మళ్లారు.
ఖమ్మం జిల్లాలో 2,04,536 ఎకరాల్లో సాగవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 92,537 ఎకరాల్లో సాగు చేశారు. భారీ వర్షాలు, వరదల ధాటికి పత్తి పంటలో పెరుగుదల లోపించింది. విత్తనం నుంచి మొలకెత్తే దశలోనే పంటలు వరదలో మునిగిపోయాయి. కొన్నిచోట్ల రైతులకు నష్టం వాటిల్లింది. అధిక పెట్టుబడులతోపాటు పురుగుమందుల పిచికారి కోసం వేలకు వేలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నారు.
ఇప్పుడిప్పుడే రైతుల్లో ఆశలు చిగురిస్తుండగా ప్రస్తుతం కాత దశలో ఉన్న పత్తి పైర్లపై తెగుళ్ల దెబ్బ వెంటాడుతోంది. ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం ఏపుగా పెరిగే దశలో ఉన్న పత్తి పంటపై తెగుళ్ల పిడుగు పడుతోంది. ఈసారి భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో పత్తి కాండం లోపలికి పురుగు వెళ్లి తినేస్తుంది. ఫలితంగా మొక్క పూర్తిగా తేలిపోయి విరిగిపోతుంది.
కాండపు ముక్కు పురుగు తెగులు ఆశించిన ప్రాంతాల్లో పత్తి మొక్కలు ఎర్రబారిపోయి ఆకులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు తెల్లదోమ, పేనుబంక తెగుళ్లు ఆశించడంతో అన్నదాతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంటనే పత్తి క్షేత్రాల్లో పర్యటించి.. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
"పత్తి పంటకు తెగుళ్లు వచ్చాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పురుగుమందులు వాడినా తగ్గని పరిస్థితి. పత్తి మొక్కలు ఎర్రబారిపోయి ఆకులు ఎండిపోతున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు పత్తి క్షేత్రాల్లో పర్యటించి.. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సూచించాలని కోరుతున్నాం." -బాధిత రైతులు
ఇవీ చదవండి: ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
వృథా నీటి వ్యాపారం.. కొనుగోలు, అమ్మకాల విధానంపై నీతి ఆయోగ్ కసరత్తు