దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో 2020-21 సంవత్సరానికి నిర్వహించే శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు ముహూర్తం నిర్ణయించారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ వైదిక పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 15 నుంచి భద్రాద్రి రామయ్య వివిధ అవతారాలలో భక్తులకు దర్శనం ఇస్తారు. డిసెంబర్ 24న సాయంత్రం స్వామివారికి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించేందుకు ఆలయ అధికారులు, వైదిక పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకు పగల్పత్తు ఉత్సవాలు.. 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం విలాస ఉత్సవాలు విశ్వరూప సేవ నిర్వహించేందుకు ఆలయ అర్చకులు తేదీలను ఖరారు చేశారు.
ఇదీ చదవండి: నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది