ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై పంజా విసురుతోంది. తొలి రోజుల్లో పురపాలకాల్లో ఒకటి రెండు కేసులు నమోదుకాగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మం నగరంలో అయితే కొవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. ఇతర మున్సిపాలిటీల్లోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధానంగా గత నెల రోజులుగా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఉభయ జిల్లాల్లోని కేసుల్లో దాదాపు 90 శాతం మున్సిపాలిటీల్లోనే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ సమయంలో అదుపులో ఉన్నా.. అన్‌లాక్‌తో ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నాయి. మూడు నెలల కాలంలో గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
వ్యాపార సముదాయాల్లో అప్రకటిత లాక్‌డౌన్
పట్టణ ప్రాంతాల్లో కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా వ్యాపార వర్గాలే ఉంటున్నారు. నిత్యం పలు ప్రాంతాల నుంచి వారి వద్దకు వందల సంఖ్యలో వినియోగదారులు వస్తుండటం, వ్యాధి బారిన పడటం జరుగుతోంది. పట్టణాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు తమకు తామే స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకుని కేసుల అడ్డుకట్టకు పనివేళలను గణనీయంగా తగ్గించుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో దాదాపు 90 శాతం వ్యాపారాలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించాలి..
పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యాపార, వాణిజ్య కూడళ్లలో జన సమూహాలను నియంత్రించాలి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న కాలనీల్లో కంటైన్‌మెంట్ తరహా కట్టడి చేయాలి. ద్రావణాల పిచికారీతో జల్లెడ పట్టాలి. పోలీసు శాఖ కూడా నిరంతరం తనిఖీలు చేస్తూ కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు ఉపక్రమించాలి. పైవన్నీ చేసినా ప్రజా చైతన్యంతోనే కరోనా కట్టడి పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందని నిపుణులంటున్నారు.
ఎందుకిలా?
1. మున్సిపాలిటీలన్నీ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కావడం, ఇతర ప్రాంతాల వారు నిత్యం కోసం ఇక్కడికి వచ్చిపోతుండటం.
2. ఉద్యోగరీత్యా, వైద్య సేవల కోసం, వేడుకలకు వెళ్తుండటం, వస్తుండటం..
3. చిన్నపాటి లక్షణాలున్నా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నా కొందరు నిర్లక్ష్యం వహించడం.
4. చీటికీమాటికి విచ్చలవిడిగా రహదారులపై సంచరిస్తుండటం.
5. అనుమానితులు, వ్యాధి లక్షణాలున్న వారికి సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరగకపోవటం.
6. మాస్కులు లేకుండా ప్రయాణిస్తుండటం. (నిబంధన ఉల్లంఘనులు ఖమ్మం జిల్లా వాసులే ఎక్కువగా ఉంటున్నారు).
ర్యాపిడ్ కిట్లు ఇలా..
* వైరాలో ఓ గృహిణి కరోనా అనుమానిత లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలింది. తనకూ పరీక్ష చేయాలని ఆమె భర్త ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేక మూడ్రోజులుగా నిరీక్షిస్తున్నారు.
* అన్ని పురపాలకాల్లోనూ ర్యాపిడ్ కిట్‌ల కొరత వేధిస్తోంది.
* భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 196 టెస్టులు చేయగా.. 45 పాజిటివ్ తేలాయి.
* పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభించారు. 100 మందికిపైగా నమూనాలు సేకరించగా 60 మందికి కొవిడ్ తేలింది. పరీక్షలు ప్రారంభించకముందే పట్టణంలో 20 కేసులున్నాయి.
* వైరాకు కేవలం 25 ర్యాపిడ్ కిట్లు మాత్రమే రాగా అన్నీ అయిపోయాయి.
* మధిరలో కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల పరీక్షల ప్రక్రియ సాగడం లేదు.
* సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి 250 కిట్లు వచ్చాయి. ఇంకా అవసరం ఉన్నాయి.
* పాల్వంచకు 250 అందాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఇంకా అవసరం ఉంది.
* ఇల్లెందులో ఇప్పటివరకు కిట్లు రాలేదు.
* మణుగూరు పీహెచ్‌సీకి 25 అందాయి. కరకగూడెం స్పెషల్ పార్టీకి చెందిన 100 మందికి పరీక్షలు చేయాలని అనుకున్నా ప్రస్తుతం 25 కిట్లు మాత్రమే వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో
ఇప్పటివరకు సేకరించిన నమూనాలు: 3,949
పాజిటివ్: 866
భద్రాద్రి జిల్లాలో..
మొత్తం నమూనాలు: 872
పాజిటివ్: 212
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
లాక్‌డౌన్ వరకు పట్టణాల్లో పరిస్థితి అదుపులో ఉంది. అన్‌లాక్‌తో తర్వాత ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరిగాయి. ఫలితంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సమూహాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.
-భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో, భద్రాద్రి
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్