కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాదిలో నిర్వహించినట్లుగానే పరిమిత సంఖ్యలోనే కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ వేడుకను జరుపుతామని స్పష్టం చేశారు. స్వామివారి ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తామన్నారు.
ఎవరూ రావొద్దు..
మహమ్మారి దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తగా ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని... భక్తులు అర్థం చేసుకొని సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించాలని కోరారు.
ఎప్పటికప్పుడు శానిటైజ్...
ఆన్లైన్లో కల్యాణ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి డబ్బులు తిరిగి చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఈ వేడుకల నిర్వహణపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: జానపదులు సైతం గానం చేస్తున్న యాదాద్రి స్థలపురాణం