భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుగ్గక్రాస్రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు వ్యక్తి పేరు సోమయ్య అని, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట ప్రాంత మావోయిస్టు పార్టీకి సానుభూతిపరునిగా పని చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు పార్టీ సభ్యునిగా పని చేస్తున్నాడని వెల్లడించారు. మావోయిస్టులు బుడుగుల గ్రామానికి వచ్చినప్పుడు వారికి ఆశ్రయం కల్పించి, నిత్యావసరాలు అంజేసి, సాయపడుతున్నట్లు చెప్పారు. అతని వద్ద నుంచి కొన్ని గోడపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పినపాక మండలం పిట్టతోగు గ్రామానికి చెందిన చీమల రవి అలియాస్ భీమా కూడా మావోయిస్టులకు సాయం చేస్తున్నట్లు తెలుసుకుని అరెస్టు చేసినట్లు ఏఎస్సై శభరీశ్ వెల్లడించారు. మణుగూరు సబ్ డివిజన్ లోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యులను, సానుభూతిపరులను గుర్తించామని తెలిపారు. మావోలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.