Lavudya Anand Selected As Scientist in CMTI : ఈ యువకుడిది మారుమూల పల్లె, తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులు. మరోవైపు పేదరికం. అయితేనేం చదువు ఒక్కటి చాలు తలరాత మార్చడానికని ముందుకు సాగాడు. పట్టుదల, సాధించాలన్న తపనతో నిరంతర సాధన చేశాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ప్రతిభ ఉండాలే గాని పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించాడు ఈ యువ శాస్త్రవేత్త ఆనంద్.
Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!
లావుడ్యా ఆనంద్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన రెడ్డిపాలెం గ్రామం. ఊర్లో ఉన్న కొద్దిపాటి భూమిలో సాగు చేసుకుంటూ కూలీపనులకు వెళ్తుంటారు తల్లిదండ్రులు. అయినా చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివాడు ఆనంద్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత గేట్ కోచింగ్‌కు వెళ్తూనే ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమయ్యాడు.
2017లో గేట్ ర్యాంకు సాధించి ఆంధ్రా విశ్వ విద్యాలయంలో(Andhra University) ఎంటెక్ పూర్తి చేశాడు ఆనంద్ . అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు వేధించేవి. వాటన్నింటికి చదువొక్కటే సమాధానంగా కష్టపడ్డాడు. అప్పుడే శాస్త్రవేత్త కావాలన్న బలమైన సంకల్పం ఆనంద్‌లో నాటుకుందని చెబుతోన్నాడు.
2021లో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నోటిఫికేషన్ రావడంతో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఆనంద్. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో శిక్షణ ఇంజినీర్‌గా పని చేశాడు. నెలపాటు అక్కడ మెళకువలు నేర్చుకున్నాక హైదరాబాద్‌లోని డీఆర్డీవో రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరాడు. ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ ల్యాబరేటరీస్ విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.
Lavudya Anand Success Story : శాస్త్రవేత్తలు డాక్టర్ బీవీ రవికుమార్, బీవీఎస్ ఆర్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఫెలోషిప్ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాడు ఆనంద్. మ్యాట్ ల్యాబ్ పై పనిచేయడం, టెస్టింగ్ విభాగం, డిజైన్, R&D విభాగంలో సమర్థంగా పనిచేశాడు. ఫెలోషిప్‌లో ఉంటూనే బెంగళూరు సీఎంటీఐలో శాస్త్రవేత్తగా అవకాశం కోసం 2023లో దరఖాస్తు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా మొత్తం 5000 మంది ఈ అవకాశం కోసం పోటీ పడ్డారు. అయినా ప్రతిభతో సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు ఆనంద్
సీఎంటీఐలో పని చేసేందుకు చాలా మంది విద్యవంతులు పోటీపడిన చివరకు తెలుగుఅబ్బాయి ఆనంద్‌కు అవకాశం వరించడం విశేషం. ఈ నెల 22న బెంగళూరు సీఎంటీఐలో శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నాడు ఆనంద్ . దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందనీ.. సరికొత్త యంత్రాలు, పరికరాలు, నానో, మైక్రో, సెన్సార్స్ తయారీలో భాగస్వామినవుతానని గర్వంగా చెబుతున్నాడు.
అనుకున్న లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమించి... శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు ఆనంద్. శక్తివంచన లేకుండా కృషి చేసి అందరి ప్రశంసలు, మన్ననలు అందుకుంటున్నాడు. పుట్టిన ఊరు, కన్నవారికి ఏజెన్సీ ప్రాంత బిడ్డ పేరు తెచ్చారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ శాస్త్రవేత్తగా ఎదగడం తమకెంతో గర్వంగా ఉందని చెప్తున్నారు ఆనంద్ తల్లిదండ్రులు.
మంచి శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నాడు ఆనంద్. శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేసి దేశానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నదే తన భవిష్యత్తు లక్ష్యమంటున్నాడు ఈ యువ శాస్త్రవేత్త.
"2017లో గేట్ ర్యాంకు సాధించి ఆంధ్రా విశ్వ విద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేశాను. తర్వాత ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. 2021లో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నోటిఫికేషన్ రావడంతో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా అవకాశం కోసం 2023లో దరఖాస్తు చేసుకుని ఎంపిక అయ్యాను". - ఆనంద్, యువశాస్త్రవేత్త