భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన యువతిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు లైంగికంగా వేధిస్తున్నాడని, తనకు లొంగిపొమ్మంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఖమ్మం కోర్టు తలుపులు తట్టింది. ఎమ్మెల్యే కొడుకు సహా అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. వారి బారి నుంచి తనను రక్షించాలని కోర్టు గుమ్మం తొక్కింది.
వాళ్ల బెయిల్ పిటిషన్ రద్దు చేయండి...
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ తనను అతని ఇంటికి పిలిపించి ఏకాంతంగా గడపాలని కోరినట్లు బాధితురాలు పేర్కొంది. అందుకు నిరాకరించిన తనను రాఘవ కొట్టాడని వెల్లడించింది. వెంటనే డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే... డీఎస్పీ ఫిర్యాదు ఉపసంపరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆవేదన వెలిబుచ్చింది. తనపై హత్యాయత్నం చేసిన వారికి మంజూరు చేసిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
బెయిలిచ్చినా... నన్ను చంపాలనే తిరుగుతున్నారు !
మళ్లీ ఫిర్యాదు చేసేందుకు తాను వెళ్లగా నిందితుడు రాఘవ తన అనుచరులతో తీవ్రంగా కొట్టించాడని బాధితురాలు వాపోయింది. తాను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్తుండగా మళ్లీ హత్యాయత్నం చేశారని భయాందోళన వ్యక్తం చేసింది. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెయిల్ మంజూరు చేశారని తెలిపింది. బెయిల్ తక్షణం రద్దు చేయాలని కోరింది.
న్యాయమూర్తి గారూ ! నన్ను రక్షించండి...
నిందితులు బయటికి వచ్చి తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని... తనకు కోర్టు రక్షణ కల్పించాలని బాధితురాలు వేడుకుంటోంది.
ఇవీ చూడండి : 'నచ్చిన పంట సాగు చేసుకునే స్వేచ్ఛ రైతులకు లేదా?'