అంతరరాష్ట్ర సరిహద్దుల్లో భద్రతా విషయంలో నిర్లక్ష్యం తగదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను హెచ్చరించారు. అశ్వరావుపేట శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జరుగుతున్న లాక్డౌన్ను పటిష్టంగా అమలు పరచాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోనే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. బ్యాంకుల్లోనూ భౌతిక దూరం పాటించాల్సిందేనని పేర్కొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులదని ఆయన తెలిపారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి దస్త్రాలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన నగదును ఎలా ప్రజలకు అందించాలన్న అంశం సీఎం ఆదేశాల మేరకు ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో సునీల్ శర్మ ఉన్నారు.