భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసి సునీత కాన్పు కోసం చేరింది. అయితే గర్భిణీకి స్కానింగ్ చేసిన వైద్యులు... కడుపులో కవల పిల్లలు ఉన్నారని... అందులోని ఆడ శిశువు మృతి చెందిందని తెలిపారు. వెంటనే ఇద్దరినీ తీసివేయాలని చెప్పి... ఆమెకు అబార్షన్ చేశారు. అనంతరం ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పి, వారిని కవర్లో పెట్టి చేతికందించారని బంధువులు చెప్పారు. కానీ పుట్టిన మగ శిశువు బతికి ఉండగానే చనిపోయిందని చెప్పారని ఆరోపించారు.
గంట తర్వాత కవర్లో బాబు కదలికలను చూసి... మళ్లీ హాస్పిటల్లో చేర్పించామని సునీత బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్, ఆర్డీవో స్వర్ణలత... ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ నిర్వహించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమా, సునీత బంధువుల ఆరోపణలో లోపముందా అనే విషయాలను దర్యాప్తు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా నివేదిక సమర్పిస్తామని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ వివరించారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాబును వేరే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
ఇదీ చూడండి : శిశువు చనిపోయిందని కవర్లో వేసి ఇచ్చారు.. తర్వాత?