భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని కామేపల్లి మండలం పింజర మడుగులో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌పై జడ్పీటీసీ వెంకట ప్రవీణ్ స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ఇసుక తీసుకొనివచ్చి వివిధ ప్రాంతాలలో కాంట్రాక్టర్ అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. మండలంలో అక్రమ ఇసుక రవాణా పై గతంలో రెవెన్యూ అధికారులు రెండుసార్లు ఇసుకను పట్టుకున్నారని గుర్తు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇల్లందు నియోజకవర్గంలో ఇప్పటికే అక్రమంగా నిలువ ఉంచిన 20 లారీల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న ఆరోపణలకు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్మాణాల పేరిట అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి