కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పటిష్ఠంగా అమలవుతుందని ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబా నగర్, జూలురుపాడు, మొదలుకుని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలలోని చెక్ పోస్ట్‌లను ఆయన పరిశీలించారు. జిల్లాలో లాక్ డౌన్ పరిస్థితుల గురించి ఎస్పీ సునీల్ దత్‌ను అడిగి తెలుసుకున్నారు.
చెక్ పోస్ట్‌ల వద్ద చేపడుతున్న చర్యల గురించి ఐజీ ఆరా తీశారు. ఇప్పటి నమోదైన కేసుల సంఖ్య, జరిమానాల గురించి అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ ప్రక్రియను పరిశీలించేందుకు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో పోలీస్‌లతో పాటు... పలు శాఖల సహకారంతో పటిష్ఠంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
కొవిడ్ నియంత్రణలో ఆరోగ్య జాగ్రత్తలు, భౌతిక దూరం, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వారు మాత్రమే బయటకు రావాలని అన్నారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్, డీఎస్పీ వెంకటేశ్వర బాబు, సీఐ నాగరాజు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దిల్లీ సరిహద్దుకు భారీగా తరలిన రైతులు