భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, సింగరేణి, కోయగూడెం ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు ,బొగ్గు వెలికితీత పనులకు కార్మికుల నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ నియామకాల్లో కార్మిక సంఘాలు, కార్మిక సంఘాల నేతలు మాత్రమే జోక్యం చేసుకునేవారు. తాజాగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పేరును అడ్డం పెట్టుకొని ఆమె భర్త హరిసింగ్ నాయక్ జోక్యం చేసుకుంటున్నారని ఇఫ్టూ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు కార్మిక సంఘాలు తమ వంతు పాత్ర పోషించే సంప్రదాయాన్ని విభిన్నంగా హరి సింగ్ నాయక్ వ్యవహరిస్తున్నారని.. కాంట్రాక్టు పొందిన వారు గత సంప్రదాయాలను పాటించకుండా వ్యవహరిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి రాస్ దీన్, జిల్లా కార్యదర్శి విశ్వనాథం ఆరోపించారు.
ఇప్పటికైనా ఓసీపీ కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోకుండా ఉండాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల జోక్యం వలన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదని, కార్మిక సంఘాల హక్కులకు భంగం కలిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, భూమిని కోల్పోయిన నిర్వాసితులకు కేవైసీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ సింగ్, పరమేష్, మారుతీరావు, రవి, మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?