కట్టుకున్న భార్యపై ఓ భర్త కత్తితో దాడిచేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారవుపేట మండలంలోని ఓట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఓట్లపల్లిగ్రామానికి చెందిన నాగరాజు అదే గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
2 రోజుల క్రితం భార్యతో గొడవపడిన నాగరాజు తన తల్లి వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పథకం ప్రకారమే అతిగా మద్యం తాగి కత్తి పట్టుకుని భార్య వద్దకు వెళ్లాడు. భోజనం పెట్టమని వెంకటలక్ష్మిని అడిగాడు. దీనితో వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమె మెడపై వేటు వేశాడు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. దీనిని గమనించిన నాగరాజు అక్కడ నుంచి పారిపోయాడు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలిని అశ్వరావుపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వాసుప్రతి తీసుకెళ్లారు. పరారిలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్ సిటీలో 'వసుంధర' పురస్కారాలు