కరోనా మహమ్మారి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం సుమారు 2 లక్షల టన్నుల వరకు డిమాండ్ ఉండేది. బొగ్గు ఉత్పత్తి.. రవాణాతో సింగరేణి ప్రాంతాలు కళకళలాడేవి. ఒకవైపు కరోనా ప్రభావం, మరోవైపు థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఉత్పత్తిని తగ్గించడంతో ఇప్పుడు బొగ్గు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. గత కొన్ని నెలలుగా సింగరేణిలో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఎక్కడికక్కడ బొగ్గు గుట్టలుగా మిగిలిపోవడం సింగరేణిలో చాలా అరుదే. ప్రస్తుత నిల్వల విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని అంచనా. రెండు మూడు నెలల్లో ఈ పరిస్థితి మెరుగుకావచ్చని యాజమాన్యం ఆశిస్తోంది.
గతంలో జోరు.. ప్రస్తుతం బేజారు
కరోనాకు ముందు సింగరేణిలో బొగ్గు వెలికితీత ఎంత వేగంగా సాగేదో, తీసిన బొగ్గుకూ అంతే డిమాండ్ ఉండేది. ఉత్పత్తి అయినదాంట్లో దాదాపు 85 శాతం విద్యుత్తు ప్లాంట్లకు సరఫరా అయ్యేది. కేటీపీఎస్, వీటీపీఎస్, ఎన్టీపీపీ, రామగుండం, వెల్లూర్ తదితర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత విద్యుదుత్పత్తి కుంటుపడి బొగ్గుకు డిమాండ్ తగ్గిపోయింది.
నష్టాన్ని పూడ్చుకోవడమెలా..?
నిల్వ చేసిన బొగ్గును భద్రంగా కాపాడుకోవడం సంస్థకు భారంగానే పరిణమిస్తోంది. ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల ఉష్ణోత్పత్తిశక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ధర తగ్గుతుంది. బొగ్గు గాలితో కలిసినప్పుడు మండే స్వభావం ఏర్పడుతుంది. అక్కడక్కడా అలా జరిగింది. దీంతో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరుబయట వేసిన నల్లబంగారం చౌర్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున భద్రత కల్పించడం సింగరేణికి అదనపు భారమే. నిల్వల కోసం తగిన ప్రాంతాన్ని వెతకడం, చదును చేయడం, భద్రత కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో సెలవు రోజుల్లోనూ అదనపు వేతనాన్ని ఇచ్చి కార్మికులతో ఉత్పత్తి కొనసాగించిన యాజమాన్యం ఒకటిన్నర నెలలుగా దీన్ని నిలిపేసింది. సగటున టన్నుకు రూ. 2,400 చొప్పున ధర లెక్కేసినా రూ. 1,038 కోట్ల విలువైన బొగ్గు నిల్వలు పేరుకుపోయినట్లు అంచనా.
రెండు, మూడు నెలల్లో సర్దుకుంటుంది
కరోనా వల్ల ఎదురైన పరిస్థితులను త్వరలోనే అధిగమిస్తాం. మెల్లగా పరిస్థితి పూర్తిగా కుదుటపడుతుంది. సంస్థకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాం.
- ఎస్.చంద్రశేఖర్, సింగరేణి డైరెక్టర్.
ఇవీ చూడండి: ఆరు ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తాం: ఈటల