గుండాల ఎన్కౌంటర్ ఘటనలో ప్రత్యక్ష సాక్ష్యులకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక మెజిస్ట్రేట్ ఎదుట సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
పోలీసులపై హత్యానేరం మోపాలని వాదన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల వద్ద లింగన్న ఎన్కౌంటర్పై పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. పోస్టు మార్టం నివేదికపై అభ్యంతరాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది రఘునాథ్ వాదించారు. గిరిజనుల సమస్యలపై పోరాడుతున్న లింగన్నను పట్టుకొని కాల్చి చంపారని.. పోలీసులపై హత్యానేరం కింద కేసు పెట్టి దర్యాప్తు చేయాలన్నారు.
ఈనెల 28కి వాయిదా
బూటకపు ఎన్ కౌంటర్ అనేందుకు నలుగురు సాక్ష్యులు ఉన్నారంటూ... వారి వివరాలను హైకోర్టుకు సమర్పించారు. అయితే సాక్ష్యుల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. స్పందించిన ధర్మాసనం వారికి భద్రత కల్పించాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశిస్తూ.. స్థానిక మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలాలు నమోదు చేసి తమకు సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై విచారణ 28కి వాయిదా