భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం రాత్రి వరకు ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి... క్రమంగా శాంతిస్తోంది. రాత్రితో పోలిస్తే 3 అడుగుల మేర గోదావరి నీటిమట్టం తగ్గింది. శనివారం రాత్రి 11 గం.కు 48.50 అడుగులుగా ఉన్న నీటమట్టం... ఉదయం 9 గంటలకు 45.3 అడుగులకు చేరింది. ఫలితంగా రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ముంపులోనే దుకాణాలు
గోదావరికి 11.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వరద నీటితో భద్రాచలంలోని రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద నీరు చేరింది. అన్నదాన సత్రంతో పాటు చాలా దుకాణాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. గోదావరి స్నానఘట్టాల ప్రాంతంతోపాటు విద్యుత్ స్తంభాలు పుష్కరఘాట్లు వరద నీటిలో మునిగి పోయాయి. భద్రాచలం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ఈ క్రమంలో ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
హెచ్చరికలు జారీ
శనివారం ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.20 అడుగులకు చేరగా... అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 47.30 అడుగులుగా నమోదైంది. సాయంత్రం 7 గంటల సమయంలో నీటిమట్టం 48.30 అడుగులు దాటింది. గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉండడంతో దానిని ఉపసంహరించుకున్నారు.
ముంపు జిల్లాలు అప్రమత్తం
గోదావరి ప్రవాహం(Godavari floods) దృష్ట్యా ములుగు జిల్లాలో ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏటూరునాగారం ముల్లెకట్టే వారధి వద్ద గోదావరి వరద ఉద్ధృతిని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా... అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తుపాకుల గూడెంలోని సమ్మక్క సాగరం బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ప్రవాహం పెరుగుతున్నందున... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పాలనాధికారి కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు.
శ్రీరామసాగర్ రికార్డు
రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో ఈసారి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జులైలో అత్యధికంగా వరద నీరు వచ్చి చేరింది. గోదావరి, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. గోదావరి ఉప్పొంగడంతో రెండు రోజుల్లోనే శ్రీరామసాగర్ జలాశయం(Sriram Sagar project) పూర్తిగా నిండిపోయింది. ఈ నెల 22న ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో వరద చేరిందని అధికారులు చెబుతున్నారు. జులై నెలలో ఇంత ఎక్కువ వరద రావడం కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగిందని వెల్లడించారు.
ఇవీ చదవండి:
- godavari flood: భద్రాద్రిలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- Warning : భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక... సీడబ్ల్యూసీ కీలక సూచన
- sriramsagar project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువకు గోదావరి పరవళ్లు
- భారీ వర్షాలతో ఉరకలెత్తుతున్న గోదావరి, కృష్ణా నదులు
- copper dam: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి.. కాపర్ డ్యాంకు గండ్లు