Godavari Floods 2023 : పది రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, వాగులు, వంకలు, చెరువులు నీటి మట్టాలు ఒకేసారిగా పెరిగిపోయాయి. రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పడినా కొన్ని ప్రాంతాలు మాత్రం జలదిగ్భందంలో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరువచ్చి పునరావాస కేంద్రాలకు వెళ్లినవారు తిరిగి ఇంటి ముఖం పట్టారు. కానీ భద్రాచలం వద్ద గోదావరికి ప్రవాహం పోటెత్తుతోంది. మూడో ప్రమాద హెచ్చరికతో 55 అడుగులకు చేరువైంది. వరద ఉద్ధృతితో భద్రాచలం నుంచి ఏజెన్సీ పల్లెలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారులు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఏపీలోని విలీన మండలాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం అంతకంతకూ పెరుగుతుండంతో ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించారు.
Godavari Water Level Increased : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి పోటెత్తున్న ప్రవాహంతో నీటిమట్టం 54.6 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహం 55 అడుగులకు చేరువైంది. రామాలయం పరిసరాల్లో నీటి ప్రవాహం చుట్టుముట్టింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Third Warning Continues in Bhadradri : ఇప్పటికే వరద ప్రవాహంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే మార్గాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. సాధారణంగా 50అడుగులు దాటితేనే ఏజెన్సీ పల్లెలకు రవాణ నిలిచిపోయే పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఏకంగా 54అడుగులు దాటడంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. భద్రాచలం నుంచి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వెళ్లే అంతరాష్ట్ర రహదారులపై నీళ్లు నిలవడం వల్ల రాకపోకలను నిలిపివేశారు. విలీన మండలాల్లోని కూనవరం, కుక్కునూరు, చింతురూ మండలాలకు రవాాణా నిలిచిపోయింది. అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలు తీసుకొని పోలీసు వాహనాల్లో పంపిస్తున్నారు.
వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటం వల్ల.. అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యల్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10మండలాలు వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజల్ని ఇప్పటికే ఈ కేంద్రాలకు తరలించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56 అడుగులకు మించదని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనావేస్తున్నారు ఐతే.. ప్రవాహం 60 అడుగులకు చేరినా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: