భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం కోయగూడెం ఓపెన్ కాస్ట్లో సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 2వేల పండ్లమొక్కలను పరిసర ప్రాంతాలలోని గ్రామాల్లో పంపిణీ చేశారు. మద్రాసు తండా గ్రామ సర్పంచ్ మాలోత్ రాజేందర్, కోయగూడెం గ్రామ సర్పంచ్ కోరం ఉమలకు ఆయన మొక్కలు అందించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పండ్ల మొక్కలను నాటి.. వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇల్లందు ఉపరితల గని ప్రాంతంలో 150 ఎకరాల్లో ఆరులక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడా ఖాళీ స్థలం కనబడకుండా మొక్కలతో నింపేందుకు చర్యలు తీసుకుంటామని జీఎం సత్యనారాయణ అన్నారు. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మీదనే మానవ జీవనం ఆధారపడి ఉందని.. అందుకే అందరూ చెట్లు పెంచేందుకు ఆసక్తి చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి పి.శ్రీనివాస్, ఏజీయం జానకిరామ్, పి.ఓ.మల్లయ్య, పర్యావరణ అధికారి సైదులు, మేనేజర్ కేఎస్ఎన్. రాజు, ఎస్టేట్ అధికారి తౌరియా నాయక్, పర్సనల్ అధికారి కృష్ణా, యూనియన్ ఫిట్ కార్యదర్శి చండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల