రాష్ట్రవ్యాప్తంగా 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన వస్తున్న ప్రవాహంతో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. భారీ ఎత్తున వరద నీరు తరలివస్తోంది.
గురువారం 17 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈరోజు 20 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో నీటి మట్టం ఇంకా పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
ప్రస్తుత నీటిమట్టం 20 అడుగుల వద్దే ఉన్నా... ఎగువన పెరుగుతున్న ప్రవాహంతో త్వరలో ప్రమాదకర స్థితికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నీటిమట్టం రికార్డ్ స్థాయిలో 60 అడుగులకు చేరి లోతట్టుప్రాంతాలను ముంచేసింది.
అదేవిధంగా జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Ys Sharmila : 'రాసి పెట్టుకోండి... ప్రభంజనం సృష్టిస్తా..'