భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సారపాకలోని తాళ్ల గొమ్మూరు కాలనీకి చెందిన వ్యక్తికి వైరస్ పాజిటివ్ రావడం వల్ల మండల అధికారులంతా అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. అతని కుటుంబ సభ్యులకు స్టాంప్ వేసి.. హోం క్వారంటైన్‌లో ఉంచారు.
ఆ ఏరియా మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మొదటిసారి మండలంలో కొవిడ్ కేసు నమోదవడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కరోనా పాజిటివ్ రాకముందు ఆ వ్యక్తి ఎవరెవరితో తిరిగాడు, ఏ ప్రదేశాలకు వెళ్లాడు అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.