భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మామిడిగుండాల, ధనియాల పాడు, బోటి గుంపు, బాలాజీ తండా గ్రామాలకు చెందిన గిరిజనులు తాము సాగు చేసుకుంటున్న భూములను గిరిజనేతరులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ భూములను పోరాటాలు చేసైనా సాధించుకుంటామని తెలిపారు. మామిడిగుండాల గ్రామ పంచాయతీకి చెందిన 37 మంది రైతులకు పట్టాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి మూడు ఎకరాల 15 సెంట్ల భూమిని కేటాయించినప్పటికీ ఐటీడీఏ ఆధ్వర్యంలో భూములను అభివృద్ధి చేస్తారని చెప్పడం వల్ల నమ్మామని వెల్లడించారు.
తమకు ఇంత వరకు స్పష్టమైన ప్రదేశంలో భూములను కేటాయించలేదని రైతులు వాపోయారు. మామిడి గుండాలలో భూముల పట్టాలు కలిగిన గిరిజనులు తమ పట్టాలను చూపించారు. సాగు చేస్తున్న పోడు రైతులు అందరు కలిసి సదస్సు ఏర్పాటు చేయాలని భావించినా.. కరోనా నిబంధనల కారణంగా దానిని విరమించుకుని గ్రామాల వారిగా పట్టాలతో ప్రదర్శన చేశారు. గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్న భూములను దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు టి.వెంకన్న, సుభద్ర, గురుస్వామి, ప్రసాద్, అనిల్ బాబు, కోటయ్య, భద్రమ్మ, వెంకన్న, రంగయ్య, సర్వయ్య పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'తెరాస నేతల జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులు'