భద్రాద్రిలో రామయ్యకు రాజ దర్బార్ సేవ, పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రామయ్య తండ్రికి మాత్రమే దశావతార ఉత్సవాలు జరుగుతాయి. ఈ రాజ దర్బార్ సేవ ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి 8 గంటల వరకు వైభవంగా జరుగుతోంది. గతంలో రాజ దర్బార్ సేవ చేసే సమయంలో 31 మంది ఈ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేవారు. సేవలో రామయ్య తండ్రికి దర్బార్ కిరీటం, మెడలో పగడాల దండ, బంగారు అద్దం, వెండి సింహాసనం, బంగారు పెన్ను, బంగారు తమలపాకు ఉంచుతారు. తనకు ఇష్టమైన సంగీతం, నృత్యం, వేదం, వాయిద్య ఘోషణలు నిర్వహిస్తారు.
హరిదాసులు కొలువై..
అర్చకులు, పరిచారకులు, చత్రచామరములు రాజలాంఛనం హరిదాసులు కొలువై చేపడతారు. ఈ సేవల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం, ద్రవిడ వేదం ఆలపిస్తారు. ముందుగా మంగళ వాయిద్యాలతో స్వామి వారిని తీసుకువచ్చి కుంభ, ధ్వజ, అష్ట, కర్పూర, నక్షత్ర హారతులు అందిస్తారు. హరిదాసులు రామయ్య తండ్రిని రాజాధిరాజా రాజమార్తాండ అంటూ పొగడ్తలతో కీర్తనలు పాడుతారు.
సలాం నిర్వహిస్తారు
వేద పండితులు వేదపారాయణం చదివిన తర్వాత స్వామివారికి అత్తరు, పన్నీరు, చూర్ణిక వేస్తూ నైవేద్యం సమర్పిస్తారు. తదుపరి సలాం నిర్వహిస్తారు. చివరగా ప్రతిరోజు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని దర్బారు సేవలో స్వామివారికి చదివి వినిపిస్తారు. రామయ్య సన్నిధిలో మాత్రమే ఈ ప్రత్యేక సేవ ప్రభుత్వ సేవగా పేరుగాంచి నిర్వహిస్తారు.
ఇదీ చూడండి : చిరుత సంచారం..జనాల్లో భయం భయం..