భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధర్యంలో చేపట్టిన జలదీక్షను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. అశ్వాపురం మండలంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే పొదెం వీరయ్యను అరెస్టు చేశారు. పోలీసులకు తెలియకుండా మరో వాహనంలో వెళ్లినప్పటికి.. వెంబడించి పట్టుకున్నారు.
నియంతృత్వ పాలన
ప్రభుత్వ తీరుకు నిరసనగా అడ్డుకున్న చోటే ఎమ్మెల్యే వీరయ్య స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ధర్నా చేశారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి.. ఇప్పటి వరకు అరాచకం కొనసాగుతోందని వీరయ్య విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో.. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పాలన సరికాదని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి