కామ్రేడ్ చందర్రావు సీపీఎం పార్టీ ఆశయాల కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ బండారు చందర్రావు 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ మీడియం బాబురావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చందర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తమ పార్టీ కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని చందర్రావును మావోయిస్టులు హత్య చేశారని తమ్మినేని పేర్కొన్నారు. వారి పోరాటాలను, ఆశయాలను కార్యకర్తలంతా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆయన పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తమ్మినేని వ్యతిరేకించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీ విధానాలను సమర్థిస్తూ వచ్చారన్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్.. ఒక్కరే వెళ్లి మోదీని కలవడంలో ఏం పరమార్థం ఉందోనని తన సందేహాన్ని వెలిబుచ్చారు. దిల్లీలో 15 రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం లేదన్నారు. మళ్లీ దేశంలో పోరాటాలు, ఉద్యమాలు మొదలయ్యాయన్నారు. వాటి వల్లనే మన ఆశయాలు సాధించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ దూరదృష్టితో ఐటీ రంగం విస్తరిస్తోంది: నిరంజన్‌రెడ్డి