భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత వ్యవసాయ విధానంపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో గిరిజనులు ఆదివాసులు ఎక్కువగా మొక్కజొన్న పంటను వర్షాధార పంటగా వేస్తారని.. ప్రభుత్వం సూచించిన పంటలు పండే అవకాశం కొన్నిచోట్ల ఉండదని దీనివల్ల గిరిజనులు, పోడు రైతులు నష్టపోతారని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. అఖిల భారత రైతు సంఘాల జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో న్యూడెమోక్రసీ నాయకులు రైతులతో కలిసి నిరసన తెలిపారు.
పలు గ్రాామాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, నాగళ్లతో రైతులు తమ నిరసనను ప్రదర్శించారు. మొక్కజొన్న పంటపై ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని, రైతులందరికీ రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని, అన్నదాతలకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందజేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు, నాయిని రాజు, నాగేశ్వరరావు, సీతారామయ్య, సారంగపాణి, పలువురు రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఓయూ భూములు పరిరక్షించాలి: చాడ, కోదండరాం