Mukkoti Ekadasi Utsavalu Bhadradri 2022: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను ఆలయం లోపలే నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 12, 13న జరగనున్న తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 13 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఈనెల 23 వరకు జరగనున్నాయి.
వివిధ అవతారాల్లో
ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు, వేదపండితులు.. బేడా మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. రేపు కూర్మావతారంలో స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ నెల 5న వరాహావతారం, 6న నరసింహావతారం.. 7న వామనావతారంలో భక్తులకు దర్శమిస్తారు. 8న పరశురామావతారం.. 9న శ్రీరామావతారం, 10న బలరామావతారం.. 11న శ్రీకృష్ణావతారంలో రామయ్య దర్శనమిస్తారు. ఈనెల 12న గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 13న ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు.
నిబంధనలు పాటించాలి
కొవిడ్ నిబంధనల దృష్ట్యా రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు.. ఒకే చోట గుమికూడ రాదని, తిరువీధి సేవ ఊరేగింపులు జరపరాదని జీవో వచ్చిందని ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఈ మేరకు ఉత్సవాలను ఆలయం లోపల నిర్వహిస్తామని వెల్లడించారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: Case registered against MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు.. ఏమైందంటే?