భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలం అచ్యుతాపురం గ్రామంలో 13ఏళ్ల భాస్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడు భాస్కర్ అశ్వారావుపేటలోని బీసీ గురుకులంలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు తన సహ విద్యార్థినికి ప్రేమలేఖ రాసి కొరియర్ బాయ్‌గా భాస్కర్‌ను వాడుకుని అతనితో లేఖను పంపించాడు.
ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్లీ అదే బాలుడు స్వీట్ బాక్స్ భాస్కరికి ఇచ్చి ఆ బాలికకు ఇమ్మని చెప్పాడు. కానీ భాస్కర్, అతని స్నేహితులు బాక్స్‌లోని స్వీట్లు తిన్నారు. ఈ సంగతి తెలుసుకున్న ఆ బాలుడు భాస్కర్ని విచక్షణారహితంగా కొట్టాడని ఆ దెబ్బలకే ఇప్పుడు తమ కుమారుడు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
తండ్రి పై అనుమానం:
ఇదిలా ఉండగా భర్త నుంచి ఆరేళ్ల క్రితం విడిపోయిన బాలుడి తల్లి మాత్రం తమ కుమారుడు మృతికి కారణం అంతుపట్టడం లేదని.. అతని మృతిపై అనుమానాలున్నాయన్నారు. తన భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: 'కార్మికుల చావులకు సంఘాలు, విపక్షాలే బాధ్యత వహించాలి '