పెంచిన విద్యుత్త్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గతేడాది మేలో 85.89 లక్షల ఇంటి కనెక్షన్లకు 143.10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా.. ఒక్కొక్క కనెక్షన్ 166 యూనిట్లు వాడినట్లు లెక్క చెప్తుందని, ఈ ఏడాది 89.20 లక్షల కనెక్షన్లకు 135.32 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలుస్తుందని ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి అన్నారు. ఈ లెక్కలు పరిశీలించి చెప్తే.. గత ఏడాది మే నెలలో కన్నా.. ఈ నెలలో ఒక్కో కనెక్షన్ 15 యూనిట్లు తక్కువ విద్యుత్ వినియోగించారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం 3.40 లక్షల కనెక్షన్లు పెరిగాయని.. గతేడాది కంటే.. ఈ ఏడాది మే నెలలో 7.78 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని మీటర్ రీడింగులే చెప్తున్నాయని రవి అన్నారు.
2019 మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలు కలిపి మొత్తం 380 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగించగా.. 2020 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 371 కోట్ల యూనిట్లు వాడారని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 9 కోట్ల యూనిట్ల వాడకం తగ్గింది. ఈ తగ్గుదలలో మే నెలలో 7.78 కోట్ల యూనిట్లు ఉందన్నారు. తగ్గిన తొమ్మిది కోట్ల యూనిట్లను మూడు నెలలకు కలిపి సగటు చేసినా దీని వల్ల నెలవారీ బిల్లు పెద్దగా తగ్గ లేదన్నారు. ఈ నెలకు నెల రీడింగ్ తీస్తే ఏప్రిల్ జూన్ లో ఇచ్చిన బిల్లు చాలా తగ్గిందని తేలింది. మే నెలలో ఇచ్చిన బిల్లు గతేడాదితో పోలిస్తే కాస్త అటుఇటుగా ఉందని లాక్ డౌన్ లో కరెంట్ వినియోగం తగ్గడం వల్ల డిస్కంలు 72.7 83 కోట్ల ఆదాయం నష్టపోయాయి. కావున ప్రభుత్వం ఆ నష్టాన్ని తిరిగి పొందడానికి జూన్ నెలలో ఒకేసారి 3 నెలల రీడింగ్ తీసి విద్యుత్ వినియోగం సగటున పంచడం వల్ల స్లాబ్ రేటు పెరిగి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలను విద్యుత్ బిల్లులనుంచి మినహాయించి.. అన్ని బిల్లులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా టెలిస్కోపిక్ పద్ధతిలో చేయాలని, వ్యాపారస్తులను బిల్లుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీ భద్రం . కోటగిరి నవీన్ , ధరావత్ కృష్ణ, కమల ,రాజశేఖర్ , పొడుగు రాంబాబు, పసిక తిరుమల్, పాపారావు తతదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్