భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ భవనాన్ని స్వాధీనం చేసుకుంటామని భద్రాచలం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్య పేర్కొన్నారు. మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనానికి గులాబీ రంగులు వేసి తెలంగాణ భవన్‌గా మార్చిన విషయం తెలుసుకున్న పొదెం వీరయ్య మంగళవారం మణుగూరుకు వచ్చారు. పార్టీ భవనానికి చేరుకున్న వీరయ్యను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పురపాలక కార్యాలయానికి వెళ్లిన పొదెం వీరయ్య కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో పార్టీ భవనానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లింపు వివరాలు చూపించాలని సిబ్బందిని కోరారు.
పార్టీ భవనం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినదేనని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ మారిన పినపాక ఎమ్మెల్యే భవనానికి గులాబీ రంగులు వేయించటం సరైన పద్ధతి కాదన్నారు. హస్తం గుర్తుపై గెలిచినందున పినపాక ఎమ్మెల్యే భవనాన్ని కాంగ్రెస్ పార్టీకే వదిలేయాలన్నారు. దాతల సహకారంతో కాంగ్రెస్ పార్టీ భవనాన్ని నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. పార్టీ భవనంలో అనేక కార్యక్రమాలు కొనసాగించామన్నారు. అవసరమైతే న్యాయపరంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవీ చూడండి: ఖమ్మం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ