భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన దశరథ్... కంకులమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. దశరథ్కు ముగ్గురు అమ్మాయిలు కాగా... కుటుంబ కలహాలతో ఓ బిడ్డను తీసుకుని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 8 ఏళ్ల క్రితం సొంత ఇళ్లు కూలిపోవటం వల్ల సింగరేణి నిర్వాసితులకు ఇచ్చిన ఓ ఇంటిలో ఇద్దరు కూతుళ్లు, తన తల్లితో కలిసి ఉంటున్నాయి. ఆ ఇల్లు సైతం శిథిలావస్థకు చేరింది. కొవిడ్ కారణంగా... సింగరేణికి సంబంధం లేని వారు ఇళ్లు ఖాలీ చేయాలని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఇంటి నుంచి ఎప్పుడు పంపిస్తారో తెలియని పరిస్థితుల్లో... తన సొంత స్థలంలో రేకుల షెడ్డు వేసుకుందామని దశరథ్ అనుకున్నాడు. కానీ... పట్టణ ప్రగతి కార్యక్రమం రూపంలో అవాంతరాలు ఎదురయ్యాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తన స్థలాన్ని పురపాలక శాఖ ఆధ్వర్యంలో చదును చేశామని... ఖర్చైన డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోనిస్తామని ఓ ప్రజా ప్రతినిధి బెదిరింపులకు దిగాడని... దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎంపీ రెడ్డి... విచారణ చేయవల్సిందిగా ఇల్లందు పురపాలక కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.
బాధితునికి 2 నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు పెట్టిన పోస్టులు సైతం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జూన్లో ఇచ్చిన నోటీసులో ప్రస్తుత కమిషనర్ సంతకం కాకుండా గత కమిషనర్ సంతకం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తన పేరిట స్థలం ఉంటే... తన కొడుకు పేరిట నోటీసు ఎలా ఇస్తారని దశరథ్ తల్లి ప్రశ్నించింది. కంకులు అమ్ముకుని జీవించే తమను... సొంత స్థలంలో ఇల్లు కట్టుకోకుండా అడ్డుపడటం దారుణమని దశరథ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సుందరీకరణ పనులు జరుగుతున్నప్పటికీ... దాని పేరు మీద కొందరు ప్రజాప్రతినిధులు తమలాంటి నిరుపేదలను దోచుకోవటం బాధాకరమని బాధితుడు వాపోతున్నాడు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.