భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మనుబోతులగూడెం పూర్తి అటవీ గ్రామం. కాలిబాట తప్ప.. రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామానికి సెల్ సిగ్నళ్లు ఉన్నా.. గ్రామంలోని గిరిజనుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో కొన్ని నెలల క్రితం వరకూ ఊరిలో ఒక్కరి వద్దకూడా సెల్ ఫోన్ లేదు.
స్థానిక సీఐ సట్ల రాజు ఈ విషయం తెలుసుకుని.. సొంత డబ్బులతో విడతల వారీగా 30 సెల్‌ఫోన్లు కొని సిమ్‌లు వేయించి గ్రామస్థులకు అందించారు. ఇలా సీఐ చేతుల మీదుగా గ్రామంలో ఫోన్ అందుకున్న వారు దానికి మొదట పూజలు చేసి వినియోగిస్తుండటం విశేషం. సీఐని ‘సెల్ రాజు’ సార్.. అని సంబోధిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్థులు తమ సమస్యలు చెప్పుకొనేందుకు వీలుగా ఫోన్లు అందిస్తున్నట్లు సీఐ 'న్యూస్‌టుడే- ఈటీవీ భారత్'కు తెలిపారు.
అదే విధంగా గిరిజన గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, టీవీ సౌకర్యం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని గ్రామాల్లో టీచర్ని ఏర్పాటు చేసి.. గిరిజన పిల్లలకు చదువు చెప్పేలా సౌకర్యం కల్పించారు. దీనితో గిరిజన ప్రజలు తమ అభివృద్దికి సహకరిస్తున్న సీఐకి అభినందనలు తెలుపుతున్నారు.