Swachh Bharat Mission 2022 : స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల అమల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేశానికి ఆదర్శంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో దిక్సూచిగా నిలిచింది. కాలుష్యం, అనారోగ్య సమస్యలను దూరం చేసేలా గ్రామాలు, పట్టణాల్లో అమలు చేస్తున్న పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు బాగున్నాయని కేంద్రం గురువారం కితాబిచ్చింది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీల్లో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధ విధానం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసలు కురిపించింది. జిల్లాలో ఇప్పటికే 479 గ్రామాలు వ్యర్థ రహిత పంచాయతీలుగా మారాయని, పల్లెల్లో నూరు శాతం ద్రవ వ్యర్థ నిర్వహణ కొనసాగుతోందని పేర్కొంది. ప్రజల భాగస్వామ్యంతో జిల్లా యంత్రాంగం కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తోందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అభినందించింది.
వ్యర్థాల నిర్వహణ...
జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్ కింద 88,416 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. రెండోదశలో మరో 1090 గృహాలకు సదుపాయం కల్పించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు. ఘనవ్యర్థాల నిర్వహణకు 22 మండలాల్లోని 479 పంచాయతీల్లో షెడ్లు నిర్మించి, వ్యర్థాలను తరలించేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఐదు అంచెల దశలో తడి, పొడి చెత్తవేరు చేయడం, సేకరణ, రవాణా, శుద్ధి, నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 168 గ్రామ పంచాయతీల్లో నూరుశాతం తడి, పొడిచెత్త నిర్వహణ జరుగుతుంటే... మిగతా గ్రామాల్లో ఈ ప్రక్రియ 70శాతంగా ఉంది. నూరు శాతం లక్ష్యం దిశగా యంత్రాంగం పనిచేస్తోంది. నాలుగు మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల్ని శుద్ధిచేసేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు.
ప్లాస్టిక్‌పై నిషేధం...
జిల్లా ప్లాస్టిక్ రహిత దిశగా ముందుకు వెళ్తోంది. రెండేళ్ల క్రితం జిల్లాలో ఒక్కసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌పై జిల్లా కలెక్టర్ నిషేధం విధించారు. దీనిపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వయం సహాయ బృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీలు స్క్రాప్‌డీలర్లతో ఒప్పందం చేసుకున్నాయి. పట్టణాల్లో ప్లాస్టిక్ కోసం ఐటీసీ సంస్థ కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, పాల్వంచలో పొడి వనరుల సమీకరణ కేంద్రాల్ని (డీఆర్‌సీసీ) ఏర్పాటు చేసింది. డీఆర్‌సీసీ కేంద్రాలకు గ్రామాల్లోని ప్లాస్టిక్‌ను తరలించాలని ఆదేశాలివ్వడంతో పాటు కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌సీసీల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అందరి కృషితో..
జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్ పథకం అమలు బాగుందని కేంద్రం ప్రశంసించడం సంతోషంగా ఉంది. జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కృషితో ఇది సాధ్యమైంది.
- రమాకాంత్, జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)
వ్యర్థాల నిర్వహణతో ఆదాయం..
పంచాయతీ సిబ్బంది సహకారంతో 90 శాతం తడి, పొడి చెత్తను వేరుచేస్తున్నాం. ఈ ఏడాది ప్లాస్టిక్ వ్యర్థాలు అమ్మటంతో పంచాయతికి రూ.12వేల ఆదాయం వచ్చింది.
- భానోతు విజయ, సర్పంచి, పూసుగూడెం, ముల్కలపల్లి మండలం
ఘనవ్యర్థాలతో కంపోస్టు
పంచాయతీల్లో సమష్టి కృషితో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఘనవ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నాం. నూరుశాతం మరుగుదొడ్లతో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచి రూ.10 లక్షల అవార్డు సాధించాం.
- భూక్యా శ్రావణి, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపాడు మండలం
ఇదీ చదవండి: CM KCR JANGAON TOUR: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన