రైతులను మోసం చేస్తున్న కంపెనీని వదిలిపెట్టి.. తమపై కేసులు ఎలా పెడతారని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సుబాబుల్ రైతులకు ఒప్పందం ప్రకారం ఐటీసీ యాజమాన్యం ధర చెల్లించడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కంపెనీ ముందు జనవరి 28న ఆందోళన నిర్వహించారు. ఐటీసీలోకి అక్రమంగా ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారంటూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో భాజపా నాయకులు హాజరయ్యారు.
దళారులతో కుమ్మక్కైన కంపెనీ అధికారులు వేధిస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఐటీసీ యాజమాన్యం బెదిరింపులకు భయపడే ప్రశ్నే లేదన్నారు. గిరిజన రైతులను మోసగిస్తున్న కంపెనీ కొనుగోలు అధికారిపై కేసు నమోదు చేయాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా సీతారాం నాయక్ ఫిర్యాదు చేశారు. సుబాబుల్ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని భాజపా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం నాయక్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేశ్, జంపన సీతా రామరాజు, భిక్షపతి, బిజ్జం శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వర్లు, దామెర శ్రీను, శ్రీనివాస్, మండల భాజపా అధ్యక్షుడు బాలాజీ, దుప్పటి సురేశ్, కైపు వెంకట్రామిరెడ్డి, లింగపల్లి రమేశ్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.