భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జిల్లా పాలనాధికారి అనుదీప్ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న పొలం వద్ద ఆగి... కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇంటింటికీ కాలినడకన
అనంతరం మండలంలోని భట్టుపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కాలినడకన పర్యటించి ప్రతి ఇంటినీ పరిశీలించారు. గృహ సముదాయాల మధ్య నీరు నిల్వ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని... గ్రామ సర్పంచి, కార్యదర్శి ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
విధులపట్ల బాధ్యతగా ఉండాలి
అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దారు విధులకు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రతి అధికారి విధులపట్ల బాధ్యతగా ఉండాలని ఆదేశించారు. మండల స్థాయిలో అధికారులు విధులను బాధ్యతగా నిర్వర్తిస్తే... ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వరలక్ష్మి వ్రతం: కిటకిటలాడుతున్న పూల మార్కెట్లు.. ఆకాశాన్నంటుతున్న ధరలు