భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని మామిడి గుండాలలో సీలింగ్ భూముల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మామిడి గుండాల, బోటి గుంపు, రాజ్య తండా, మేడికుంట, ధనియాలపాడు గ్రామాలకు చెందిన పేద గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములకు ఎలాంటి హద్దులు నిర్ణయించలేదు.
అయితే ఈ భూములను రాఘవేంద్ర రావు అతని బంధువు స్నేహలత ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తిరుమలగిరి ప్రాంతం నుంచి 20 మంది యువకులతో రైతులు సాగు చేసుకునే విత్తనాలు నాటిన భూములను ధ్వంసం చేశారన్నారు. రైతుల మీద దాడి చేసి.. వారి పైనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
వివాదంలో ఉన్న ఈ భూములను సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. అలాగే గిరిజన రైతులకు రక్షణ కల్పించాలని.. వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం