Orphan girl: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన కోటోజు సుధాకర్, జయమ్మ దంపతుల ఏకైక సంతానం చంద్రకళ. వయసు 9 ఏళ్లు. మూడేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. అన్నీతానై తల్లి జయమ్మ చంద్రకళను సాకుతూ వచ్చింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సమయంలో.. తల్లికి క్యాన్సర్ సోకి మంచానపడింది. చంద్రకళ చదువు మానేసి ఇంటిపని, వంట పని చేస్తూ తల్లికి సపర్యలు చేసింది. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శుక్రవారం కన్నుమూసింది. ఆరేళ్లకు తండ్రికి, 9 ఏళ్లకు తల్లికి చిట్టిచేతులతో తలకొరివి పెట్టిన చంద్రకళ అనాథలా మారింది.
ప్రస్తుతం చంద్రకళ ఉండేందకు నిలువ నీడ లేదు. తల్లి ఉన్నప్పుడు బంధువులు ఇచ్చిన ఖాళీ స్థలంలో నాలుగు రేకులతో ఇళ్లు వేసుకున్నారు. ఇంటి చుట్టూ టార్పాలిన్ పట్టాలు కప్పుకున్నారు. తల్లి దహనసంస్కారాలు ఇరుగుపొరుగు వారే తలా ఇంత డబ్బులు వేసుకుని నిర్వహించారు. తల్లి దశ దినకర్మకు ఖర్చులు బాలిక వద్ద లేవు. తల్లి దూరమైనప్పటి నుంచి ఇరుగుపొరుగు వారే భోజనం పెడుతున్నారు. ప్రతిక్షణం తల్లిదండ్రులను తలచుకుని చంద్రకళ ఏడుస్తోంది.
తల్లి చనిపోయినప్పటి నుంచి ఆమెను తలచుకుంటూ రాత్రింబవళ్లు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తుంటే.. బాలికను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. బాలిక కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయి. బాలిక కష్టాలు చూసిన చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు. తల్లి బతికి ఉన్న సమయంలో డాక్టర్ కావాలని కోరిందని ఎన్నికష్టాలు ఎదురైనా చదువుకుంటానంటోంది చంద్రకళ. డాక్టరు కావాలన్న తల్లి కల సాకారం చేయడానికి సహకరించాలని.. అనాథ బాలిక చంద్రకళ దీనంగా వేడుకుంటోంది. మానవతావాదులు స్పందించి తనను చేయూతనివ్వాలని చేతులు జోడించి దీనంగా వేడుకుంటోంది.
ఇవీ చూడండి: పుడ్డింగ్ పబ్ కేసులో ఒకరికి బెయిల్.. మరొకరికి నిరాకరణ..!
టాయిలెట్ లేదని పెళ్లైన రెండో రోజే పుట్టింటికి మహిళ.. భర్త తిట్టాడని ఆత్మహత్య