Farmer Protests for Compensation: మూడేళ్లకు పైగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిరసన గళం వినిపిస్తున్న రైతు సుందర్.. మరోసారి గణతంత్ర దినోత్సవం రోజు నిరసన చేపట్టారు. జాతీయ జెండాను గౌరవిస్తూ పట్టణంలో ప్రదర్శన చేస్తూ.. తన నిరసన గళాన్ని వినిపించారు. సింగరేణి ఉపరితల గని విస్తరణలో భాగంగా మూడేళ్ల క్రితం భూమి కోల్పోయిన రైతుకు.. ఇప్పటికీ ఆ సంస్థ నుంచి పరిహారం అందలేదు. పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని... ఆ సంస్థ వల్ల నష్టపోయానని వాపోతూ మూడేళ్లుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఎడ్లబండిపై జాతీయ జెండాను ఏర్పాటు చేసుకొని పట్టణంలోని పలు ప్రాంతాల్లో 'సింగరేణి సంస్థ వల్ల తన కుటుంబం నష్టపోయింది' అన్న విషయాలను ఫ్లెక్సీల ద్వారా వివరిస్తూ పర్యటించారు.
పలుమార్లు ఫిర్యాదు
గతంలోనూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌కు రైతు సుందర్.. ఎడ్ల బండి మీద వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు గతేడాది హైదరాబాద్ వెళ్లిన రైతును అడ్డుకున్న అధికారులు.. అతనికి సర్ది చెప్పి స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తిప్పి పంపించారు. అధికారులకు, సింగరేణి అధికారులకు మూడేళ్లుగా మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పట్టణంలో కొన్ని రోజుల క్రితం టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. సుందర్ కుమారుడు సంజయ్ సైతం బైక్‌పై దిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్ వద్ద.. సింగరేణి సంస్థ ద్వారా నష్టపోయామని నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. సింగరేణి ప్రజాభిప్రాయ సేకరణలో సైతం తన గోడును వెళ్లబోసుకున్నా నిరాశే ఎదురైంది. అయినా కృంగిపోకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
"సింగరేణి సంస్థ కారణంగా మా కుటుంబం చాలా నష్టపోయింది. కొన్నేళ్లుగా ఇప్పటికే ఎన్నో సార్లు అధికారులను వేడుకున్నాం. అయినా మాకు పరిహారం దక్కలేదు. కనీసం మాకు చావడానికి ఐనా అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని వేడుకుంటున్నాం." --సంజయ్, రైతు సుందర్ కుమారుడు
ఇదీ చదవండి: CM KCR: 'రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేయాలి'