ఆ చిన్నారికి తన తల్లి రాత్రే చనిపోయిందని తెలియని పరిస్థితి. ఉదయమే అమ్మా లే.. అమ్మా లే అంటూ ఆ బాలుడు తన తల్లిని పిలుస్తుంటే చూసినవారి కళ్లు చెమ్మగిల్లాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణం సంతపాకల వద్ద బుడగలు విక్రయిస్తూ ఉండే సంచార జాతికి చెందిన నిర్మల (45) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఉదయం నుంచి భారీ వర్షం రావడంతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ చలి గాలుల్లోనే ఉండిపోయింది. రాత్రి తన కుమారుడైన కృష్ణని పక్కనే పడుకోబెట్టుకొని నిద్రపోయింది. తెల్లవారి లేచేసరికి చనిపోయి ఉంది. ఇది తెలియని బాలుడు ‘అమ్మా లే .. అమ్మా లే’ అంటూ కనిపించిన వారినల్లా ‘మా అమ్మకు ఏమైంది లేవడం లేదు’ అని అడగటంతో ఏమిచెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ చల్లా అరుణ ఘటనా స్థలానికి వచ్చి వారి వద్ద ఉన్న ఆధార్‌కార్డులు, ఇతర అడ్రసుల ఆధారంగా హైదరాబాద్, వరంగల్‌లో ఉంటున్న వారి బంధువులకు సమాచారం అందించారు. నిర్మల భర్తతో విడిపోయినట్లు సమాచారం. శవ పంచనామా నిర్వహించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు నిర్మలకు తెలిసిన మరో మహిళ వద్ద ఉన్నాడు.
ఇదీచూడండి: Brutal Incident: ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఓ తల్లి నిర్వాకం