వేసవికాలం రానే వచ్చింది.. ఓ పక్క భానుడు భగభగ మండుతున్నాడు. మరో పక్క కరోనా విలయతాండవం చేస్తోంది. అధికారులు ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పుట్లూరు, నార్నూర్ మండలాలతో పాటు పలు మండలాల ప్రజలు మాత్రం తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. ఆదివాసీలు మంచినీటి కోసం బిందెలు పట్టుకుని మైళ్ల దూరం పరుగులు తీస్తున్నారు. అక్కడి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం పడకేసి.. అలంకార ప్రాయంగా దర్శనమిస్తుంది.
నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు నేటి వరకు పూర్తి కాకపోవడం వల్ల గిరిగూడాలోని ప్రజలు తాగునీటి కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొంది. శాంతాపూర్, నర్సాపూర్, గొట్టిపర్తి వంటి పలుప్రాంత ప్రజలు సమీపంలోని వాగులు వంకలను వెతుకుంటూ చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా తాగునీటిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నీటి జాడ కనిపించే చోటికి పయనమవుతున్నారు. స్థానిక అడవుల్లోకి వెళ్లి చెలిమలు తీసి నీటిని తోడుకుంటూ జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తమకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ప్రతి సంవత్సరం మాకిదే గోస.. తాగడానికి నీరు లేక ఇలా మైళ్ల తరబడి ప్రయాణం చేసి బిందెలతో నీటిని తీసుకెళ్తున్నాం- దొంగచింత గ్రామస్థుడు'
నాలుగైదు గ్రామాల ప్రజలు వారి నీటి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు.. దీనిని పై అధికారులకు చేరవేసి వారికి నా వంతు సాయంగా నీటి ట్యాంకర్లను తెప్పించే ప్రయత్నం చేస్తా- ఉట్నూర్ ఎంపీపీ జయంత్రావు'