ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి పరిసరాల్లో పులి సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం పులి ఓ ఆవును హతమార్చి, ఎద్దుపై దాడి చేసింది. ఆ ఘటన మరువకముందే ఈరోజు పంట చేనులో మరో ఎద్దుపై విరుచుకుపడింది.
గమనించిన గ్రామస్థులు బిగ్గరగా కేకలు వేయడం వల్ల ఎద్దును వదిలేసి పులి పరుగు తీసింది. వారం రోజుల వ్యవధిలో రెండు పశువులు పులి చేతిలో హతమయ్యాయి. భయానికి గురైన గ్రామస్థులు పంట చేలకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. గ్రామానికి కూతవేటులో జరిగిన నేటి ఘటనతో మరింత భీతిల్లారు.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి తరచు పులులు వచ్చి, పశువులను హతమారుస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు ఘటనలు జరిగినప్పుడు వచ్చి వెళ్తున్నారే కానీ... తమ ప్రాణాలకు ఎలాంటి భరోసానివ్వడం లేదని వాపోయారు.
- ఇదీ చూడండి : 'భీంపూర్' వణుకుతోంది... కంటినిండా నిదరే కరువైంది!