పత్తి క్రయ విక్రయాలకు ఖండాంతర ఖ్యాతిగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వేలాది వాహనాలతో కళకళలాడాల్సిన వ్యవసాయ మార్కెట్ యార్డు ... బోసిపోయి కనిపిస్తోంది. ఆశించిన దిగుబడుల్లేనందున రైతుల్లోనూ ఆందోళన నెలకొంది.
అకాల వర్షాలతో అనర్థం
వర్షాదారాధారితమైన ఆదిలాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణంలో పత్తి ప్రధాన పంటగా నిలుస్తోంది. సహజంగానైతే ఎకరాకు సగటున పది క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూతా, కాతారాలిపోయి దిగుబడి సగానికి సగం పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఎకరాకు 5 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు... డిమాండ్ కారణంగా క్వింటా ధర రూ.8వేల వరకు పలుకుతున్నప్పటికీ... మార్కెట్‌కు పత్తి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈనెల 25న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభ రోజు మొత్తం 670 వాహనాల్లో 10,800 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. మరుసటి రోజు అంటే ఈనెల 26న 322 వాహనాల్లో కేవలం 4,870 క్వింటాళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చింది. దిగుబడి లేక... దిగాలుగా ఉంటే... నాణ్యత, తేమ పేరిట వ్యాపారులు ధరలో కోత విధిస్తుండటం... రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
రైతుల ఆవేదన
ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరల పెరుగుదలకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదనేది రైతుల ఆవేదనగా వినిపిస్తోంది. పంట ఉత్పత్తులు రైతుల దగ్గర ఉన్నప్పుడు తేమ, నాణ్యత పేరిట ధరలో కోత విధించడం, వ్యాపారుల గోడౌన్లకు సరుకు... చేరుకున్న తరువాత అంతర్జాతీయంగా పెరగడమనేది మార్కెటింగ్ మాయాజాలమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పత్తి క్రయవిక్రయాలకు ఖండాంతర ఖ్యాతిగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోనే ఆశించినట్లుగా దిగుబడులు రాకపోవడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. పత్తి బేళ్లకు ఉన్న డిమాండ్ మేరకు తేమతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.9వేల నుంచి రూ.10వేల వరకు కోత లేకుండా ధరలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి :