ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి కొవిడ్ నిబంధనలు అనుసరించి పాఠశాలలకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పాఠశాలలు ప్రజ్ఞ మార్గదర్శకాల ప్రకారం లెర్నింగ్, డిజిటల్ విద్యను సమయసారిణి ప్రకారం అమలు చేయాలని సూచించారు.
పూర్వ ప్రాథమిక, నర్సరీ, ప్లేస్కూల్ విద్యార్థులకు ప్రతినిత్యం 45 నిమిషాల పాటు వారానికి మూడు రోజులు తల్లిదండ్రుల సమక్షంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలన్నారు. 1 నుంచి 5 తరగతులకు ప్రతి రోజు రెండు సెషన్స్‌లో 45 నిమిషాల వరకు వారానికి 5 రోజులు ఉండాలని సూచించారు.
6 నుంచి 8వ తరగతి వరకు మూడు సెషన్లు, రోజుకు 2 గంటల చొప్పున అయిదు రోజులు ఉండాలని పేర్కొన్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు నాలుగు సెషన్లలో వారానికి అయిదు రోజులు గరిష్ఠంగా 3 గంటల సమయం తరగతులు బోధించాలని సూచించారు.