ఆదిలాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ తరగతులను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు టీ-శాట్ విద్య, దూరదర్శన్(యాదగిరి) ఛానల్‌ల ద్వారా ఆయా తరగతులకు అందజేసిన సమయసారిణి ప్రకారం పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నాయి. కొంతమందికి సొంత టీవీలు లేకపోవడం, ఉన్న వారికి డిష్ సౌకర్యం లేక అవరోధంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే వస్తోంది. దీంతో టీ-శాట్‌లో ప్రసారమయ్యే పాఠాలను విద్యార్థులు వీక్షించలేకపోతున్నారు.
విద్యార్థులకు పంపిణీ చేయడం కోసం అధికారులు అభ్యాసనపత్రాలు(వర్క్‌షీట్లు) సిద్ధం చేశారు. కానీ వీటిని ప్రింట్ తీసి ఒక్కో పాఠశాలకు అందించాలంటే సుమారు రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. దీంతో విద్యార్థుల వాట్సాప్ గ్రూపులకు పంపిస్తున్నారు. కొన్ని చోట్లనే విద్యార్థులకు ప్రింట్ కాపీలు పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు విద్యుత్తు అంతరాయం విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఆదిలాబాద్ గ్రామీణం, భీంపూర్, తాంసి, తలమడుగు, సిరికొండ, జైనథ్, బేల, నేరడిగొండ తదితర అన్ని మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొంది. ఇలా ఆయా సమస్యలను అధిగమిస్తే.. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు సులువుగా మారేందుకు ఆస్కారం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
డిష్ టీవీల్లో 6, 7వ తరగతుల పాఠాలు ప్రసారం కావడం లేదు. ఇది గమనించిన తాంసి(కె) ఉపాధ్యాయులు చరవాణి ద్వారా పాఠాలు వినేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యాసన పత్రాలు(వర్క్‌షీట్లు) అందజేసి పాఠాలు చదివిస్తున్నారు.
భీంపూర్ మండలం అర్లి(టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని విద్యార్థులు విద్యుత్తు అంతరాయంతో టీవీలు వీక్షించలేకపోతున్నారు. దీంతో అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని వారి ఇళ్లకు వెళ్లి చరవాణులు వినియోగించేలా చూస్తున్నారు. పాఠశాలకు సమీపంలోని శాంతినగర్ గిరిజన గూడెంలో చరవాణి సౌకర్యం లేని విద్యార్థులకు ఉపాధ్యాయులు చరవాణిలో పాఠాలు వినిపిస్తున్నారు.
సిరికొండ మండలం చింతగూడలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 11 మంది ఉంటారు. వీళ్లకు ఎవరికీ సొంత టీవీలు, చరవాణులు లేవు. ఇతరుల ఇళ్లకు వెళ్లి చూడాలి. ఇక్కడ టీ-శాట్ ప్రసారాలు అందుబాటులో లేవు. కేవలం దూరదర్శన్(యాదగిరి) మాత్రమే ఉంది. దీంతో ఇందులో వచ్చే పాఠాలు మాత్రమే వీక్షించాలి. మిగతా వాటిలో ఏయే పాఠాలు ప్రసారమవుతున్నాయో ఈ విద్యార్థులకు తెలియని పరిస్థితి ఉంది. ఇదే మండలంలోని భీంపూర్‌లోనూ ఇదే సమస్య ఉంది.
జైనథ్ మండలం పార్డి(బి)లో చరవాణి సంకేతాల సమస్యలు ఉండటంతో విద్యార్థులకు అభ్యాసనపత్రాలు అందించారు. వీటి ద్వారా విద్యార్థులు చదువుతుండగా ఉపాధ్యాయులు రోజువారీగా పర్యవేక్షణ చేపడుతున్నారు. మిగతా చోట్ల కూడా అందిస్తే మంచి ఫలితం ఉంటుంది.
త్వరలోనే అవరోధాలను అధిగమిస్తాం
తొలిసారి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాం. మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఉన్నా మాట వాస్తవమే. వాటిని త్వరలోనే అధిగమించేందుకు కృషి చేస్తాం. సంకేతాల సమస్యలు ఉన్న చోట్ల వర్క్‌షీట్లు అందజేయాలని ఇది వరకే ఉపాధ్యాయులకు సూచించా. విద్యుత్తు అంతరాయం గురించి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడాం. దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో కొన్ని చోట్ల టీవీలు సమకూర్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
- డా.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
- జిల్లాలో విద్యార్థులు : 43,371
- సేకరించిన చరవాణి నెంబర్లు : 25,690
- టీవీ, డీటీహెచ్ కలిగిన వారు : 13,321
- టీవీ కలిగి ఉండి కేబుల్ కనెక్షన్ ఉన్నవారు : 19,234
- చరవాణులకు ఇంటర్‌నెట్ సౌకర్యం : 906
- చరవాణులకు ఇంటర్‌నెట్ సౌకర్యం లేనిది : 9,757
- ల్యాప్‌టాప్ సౌకర్యం : 153
- పంచాయతీల్లో టీవీలు ఏర్పాటుచేసిన విద్యార్థులు : 5,818
- టీవీ, డీటీహెచ్, చరవాణి ఇలా ఏదో ఒకటి ఉన్నవారు : 37,553