వైద్యఆరోగ్య శాఖ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు మెరుగుపడ్డాయి. మరోవైపు కేసీఆర్ కిట్టు, ఆర్థిక సహాయం, డయాలసిస్ వంటి అనేక వైద్య సేవలు పేదలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బంది పనిభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీరినే అవసరం ఉన్నచోటకు డిప్యుటేషన్‌పై పంపిస్తున్నారు. ఒక్కరికే మూడు నాలుగు అదనపు శాఖలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎం, పర్యవేక్షకులు, ల్యాబ్‌టెక్నిషయన్లు, వివిధ పనులు నిర్వహించే సిబ్బందిని కలిపితే 502 ఖాళీలు భర్తీకి నోచుకోలేదు.
- ఉమ్మడి జిల్లాలో 229 మంది వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 159 మందే ఉన్నారు. అనేక పీహెచ్‌సీల్లో ఒక్కొక్క వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఆయన సెలవు తీసుకుంటే ఇక వైద్యం అందే అవకాశమే లేదు.
- ఉమ్మడి జిల్లాలో 1058 మంది నర్సులు, ఏఎన్‌ఎంలు భర్తీ కావాల్సి ఉండగా 865 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. పర్యవేక్షకులు 328 మందికి 223 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఆశా కార్యకర్తల ఖాళీలు అలాగే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జ్వరాలు, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వైద్య సిబ్బంది లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆసుపత్రుల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు కలగకుండా చూడటంలో భాగంగా ఇది తప్పనిసరి అయింది. త్వరలో పోస్టులు భర్తీ చేస్తారని ఆశిస్తున్నాం.
-ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్
పేరుకే 30 పడకల ఆసుపత్రి..
నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్(జి) ఆసుపత్రి గతంలో 24 గంటల ఆసుపత్రిగా ఉండేది. తర్వాత 30 పడకలకు మార్చారు. స్థాయికి అనుగుణంగా ఆరుగురు వైద్యులు, అయిదుగురు నర్సులు ఉండాలి. ఇద్దరు చొప్పున ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బంది అవసరం. కేవలం ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ల్యాబ్, ఫార్మసిస్టు ఒక్కొక్కరే ఉన్నారు. వీరితోనే నెలకు 50 నుంచి 60 వరకు ప్రసవాలు జరుపుతున్నారు. క్షయ, ఎయిడ్స్, ఇమ్యూనైజేషన్, మలేరియా తదితర విభాగాలకు ప్రత్యేక నిర్వహణాధికారులు లేక వీరికే అదనపు బాధ్యతలు కేటాయించారు.
ఇదీ చదవండిః గర్భిణీలకు మాత్రమే.. మిసెస్ మామ్స్ కాంటెస్ట్!