ఆ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడం, అటువైపు 108 వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. మార్గమధ్యలోనే అంబులెన్స్ సిబ్బంది.. ఊళ్లోకి వెళ్లి నిండు గర్భిణీకి ప్రసవ వేదన తీర్చారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం తుమ్మల పాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గర్భిణీ పూజ తాయికి ఉదయం నుంచే పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఊళ్లోకి వాహనం వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కిలోమీటరు దూరంలోనే అంబులెన్స్ ఉంచి.. సిబ్బంది ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈఎంటీ కాశీనాథ్, పైలెట్ గోపీనాథ్లతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను వైద్యం నిమిత్తం కిలోమీటరు దూరం ఎడ్లబండి సహకారంతో తీసుకెళ్లారు. అక్కడినుంచి 108 వాహనంలో ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.

తప్పని వేదన
ఏళ్లుగా కనీస రహదారికి నోచుకోక పోవడంతో గ్రామస్థుల ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించకపోవడంతో ఎంతో మంది మాతృమూర్తులకు ఈ వేదన తప్పడం లేదు. 108 సిబ్బంది సహకారంతో తమకు ఇబ్బంది తీరిందని.. అత్యవసర సమయంలో తమకు అండగా నిలిచారని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: NEW RATION CARDS: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..