Pippalkoti barrage victims : తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని చనాకా-కొరటా బ్యారేజీకి అనుబంధంగా ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా పిప్పల్‌కోటి శివారులో బ్యారేజి నిర్మాణానికి 4 ఏళ్ల కిందే శ్రీకారం చుట్టింది. దాదాపు వెయ్యి ఎకరాల్లో నిర్మించే ఈ బ్యారేజీలో 1.42 TMCల నీటితో 37వేల 500 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
Pippalkoti barrage victims protest : తొలుత సేకరించిన 187 ఎకరాలకు 2019 భూముల ధరల ప్రకారం ఎకరాకు 8లక్షల చొప్పున సుమారు 15కోట్లు చెల్లించింది. మిగిలిన 837 ఎకరాలకు తాజాగా 7 లక్షల రూపాయలు పరిహారంగా నిర్ణయించటం మిగిలిన 198మంది రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం భూముల ధరలు అమాంతంగా పెరుగుతుంటే గతం కంటే పరిహారం తగ్గించడం మేంటనే రైతుల ప్రశ్నకు సమాధానం కరువవుతోంది.
పిప్పల్‌కోటి ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం తగ్గింపు ప్రకటనతో రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రాజెక్టు ప్రాంతం నుంచి ఆదిలాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయం వరకు ఎడ్లబండ్లతో యాత్ర నిర్వహించి నిరసన తెలిపినా అధికారుల నుంచి స్పందన రాలేదు. ఏటీకేడు భూముల ధరలు పెరగడమనేది వాస్తవమే అయినా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తాము నడుచుకోవాల్సి వస్తుందని అధికారులు వెల్లడించడం విస్మయం కలిగిస్తోంది.
ఏటా జీతాల పెంపునకు వర్తించే నిబంధనలను ప్రభుత్వానికి నివేదించే అధికారులు రైతులకు గోడుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నాలుగేళ్ల కిందనే ముంపునకు గురయ్యే భూమంతటికీ సమాన పరిహారం ఇచ్చి ఉంటే రైతులు మరో చోట కొనుక్కునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ పరిహారం తగ్గటం..... పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరగటంతో దిక్కుతోచని స్థితిలో బాధిత కర్షకులు కాలం వెల్లదీస్తున్నారు.
"చనాకా- కొరటా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మా భూమి పోతోంది. గతంలో ఇచ్చిన పరిహారం కంటే ఈసారి ఇంకా తక్కువ డబ్బులు ఇస్తామంటున్నారు. రోడ్డు పక్కనే మా భూమి ఉంది. గతంలో ఎకరాకు ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడేమో ఏడు లక్షలు మాత్రమే ఇస్తాం అంటున్నారు. వీరిచ్చే డబ్బులతో బయట భూమిని కొనుగోలు చేయలేము. భూనిర్వాసిత రైతులకు పరిహారం పెంచాలి". -గణేశ్‌రెడ్డి, భూనిర్వాసిత రైతు
"గతంలో 120జీవో కింద 187 ఎకరాల భూమికి ఎకరాకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించాం. ఇప్పుడు భూములను కోల్పోతున్న రైతులు ధర ఎక్కువ చెల్లించాలని కోరుతున్నారు. నియమాలు మారడం వల్ల ఇప్పుడు 2013యాక్ట్ ప్రకారం చెల్లిస్తామంటున్నాం". -రమేష్ రాఠోడ్, ఆర్డీవో
ఇవీ చదవండి: