ఆదిలాబాద్ జిల్లా కరోనా రహితంగా మారింది. వైరస్ సోకిన బాధితులంతా నయమై ఇళ్లకు చేరుకున్నారు. జిల్లా కరోనా రహిత ప్రాంతంగా మారినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోనట్లయితే ముప్పు కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వైద్యవర్గాల నుంచి వ్యక్తమవుతోంది. భౌతికదూరం, మాస్కుల వినియోగం, పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత కీలకం. తాజాగా ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో కరోనా కేసుల నిర్ధరణ వెసులుబాటు కల్గినప్పటికీ తీవ్రత పెరిగితే మళ్లీ లాక్‌డౌన్, కంటైన్మెంట్ కఠినతరం చేయడం కష్టతరమే.
సమష్టి కృషి:
జిల్లాలో కరోనా బాధితులంతా ఆరోగ్యంగా తిరిగిరావడంలో అధికారయంత్రాంగం సమష్టికృషి ఉంది. జిల్లా పరిధిలో ప్రధానంగా రెవెన్యూ, పోలీసు వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే కారణంగా వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తుల గుర్తింపు సకాలంలో జరిగింది. వారికి సకాలంలో పరీక్షలు నిర్వహించడం, వెంటనే హైదరాబాద్‌కు తరలించడంతో వ్యాధి ప్రబలలేదు. జిల్లాలో ఏప్రిల్ రెండోతేదీన ఆదిలాబాద్, ఉట్నూర్, నేరడిగొండ మండలాల నుంచి దిల్లీలోని నిజామొద్దీన్‌కు వెళ్లివచ్చిన వారి వివరాలు వెల్లడి కాగా అదే నెల మూడో తేదీన తొలి కరోనా కేసు నమోదైంది.
మొత్తం 76 మంది మర్కజ్ యాత్రికుల్లో 10 మందికి కరోనా ఉన్నట్లు బయటపడింది. బాధితులకు దగ్గరగా మసిలిన వారితోపాటు ప్రాథమికంగా కలిసివారు మొత్తం 829 మందిని క్వారంటైన్‌కు తరలించడంలో పూర్తిగా సఫలీకృతమైంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి రక్తపరీక్షలు నిర్వహించగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 21కి చేరింది. వీరందరూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 29న ఒక్కరితో ప్రారంభమైన బాధితుల డిశ్ఛార్జి విడతలవారీగా సాగింది. మిగిలిన ముగ్గురు బాధితులు కూడా బుధవారం రాత్రితో డిశ్ఛార్జి కావడంతో ఇప్పుడు జిల్లా కరోనా రహిత ప్రాంతంగా మారింది.
కలిసొచ్చిన కంటైన్మెంట్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసిన కంటైన్మెంట్ ప్రాంతం పూర్తిగా కలిసివచ్చింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్ మొదలుకొని ఈనెల మూడోతేదీ వరకు ఆదిలాబాద్‌లోని 19 వార్డులు, ఉట్నూర్ మండలంలోని అయిదు గ్రామాలు, నేరడిగొండ మండలంలో మూడు గ్రామాల్లో రాకపోకలను పోలీసుశాఖ నియంత్రించింది. ఎప్పుడూ లేనంతగా ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం వ్యాధి నియంత్రణకు దోహదం చేసింది. అదే సమయంలో ప్రత్యేకాధికారుల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలతో ఇంటింటిి సర్వేచేయించడం ప్రజలను సైతం అప్రమత్తం చేసినట్లయింది. మున్సిపాల్టీ, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలోనూ పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవరోధం ఏర్పడలేదు.
సహకరించిన ప్రజలు
అధికార యంత్రాంగం అమలు చేసిన నిబంధనలన్నింటికీ ప్రజలు సానుకూలంగానే స్పందించారు. ఈ నెల మూడోతేదీన లాక్‌డౌన్‌లో కాస్తంత సడలింపు ఇచ్చేదాకా పెద్దగా నిబంధనలను అతిక్రమించలేదు.
ప్రజాప్రతినిధులు సైతం తమ తమ పరిధిలోని పరిస్థితులను పర్యవేక్షిస్తూ గల్లీవారియర్స్‌తో ఇళ్లకే నిత్యావసర సరకులను పంపించే ప్రయత్నం చేశారు. మరోపక్క జిల్లాలోనే చిక్కుకొని ఉన్న వలసకార్మికులతో పాటు నిరుపేదలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర సరకుల పంపిణీ కోసం ప్రభుత్వ పరంగా అధికారయంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలకు మానవతావాదుల సహకారం కూడా పుష్కలంగానే లభించింది. ఫలితంగా జిల్లాలో వ్యాధితీవ్రత పెరగకుండా అడ్డుకట్ట వేసినట్లయింది.