ప్రశ్న: ఎమ్మెల్సీ ఎన్నికకు మీకు కలిసివచ్చిన అంశాలేమిటి?
విఠల్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతు ఏకపక్షంగా లభించడం వల్ల గెలుపు సునాయసమైంది. ఇది మరచిపోని ఘట్టం. ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
ప్రశ్న: స్థానిక సంస్థల్లో తుడుందెబ్బ ప్రతినిధులు లేకపోయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థికి 75 ఓట్లు వచ్చాయి. అంటే స్వతంత్ర అభ్యర్థికి మీ పార్టీ సభ్యులే ఓట్లేశారనుకుంటున్నారా?
విఠల్: లేదు..లేదు.. మా పార్టీ ఓటర్లంతా నాకే ఓట్లేశారు. అందులో అనుమానమే లేదు. వాస్తవంగా ఉమ్మడి జిల్లాలో మా పార్టీ సభ్యుల బలం 707 ఓటర్లే. కానీ నాకు 742 ఓట్లు లభించాయంటే మేం అనుకున్నదానికంటే ఎక్కువే కదా. మా పార్టీ సభ్యులే కాకుండా ఇతరులు సైతం నాకు ఓట్లేశారు. మేం మంచి చేస్తామనే ఆలోచనతోనే ఇతరులు సైతం మాకు మద్దతు ప్రకటించారు.
ప్రశ్న: మీరు బయటకు వెల్లడించకపోయినా ఉమ్మడి జిల్లా తెరాసలో అంతర్గత అసమ్మతి ఉంది. మంత్రి సహా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య అంతరం కారణంగా పరస్పరం దూరం పెరిగిందనేది వాస్తవం. ఉమ్మడి జిల్లా పదవిలో ఉండే మీరు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎలా సమన్వయం చేస్తారు?
విఠల్: దాదాపుగా నెలరోజుల ఎన్నికల ఘట్టం నుంచి పరిశీలిస్తున్న నాకు ఉమ్మడి జిల్లా పార్టీ నేతల మధ్య అంతర్గత వైరుద్యం, అసమ్మతి, ఉన్నట్లు కనిపించలేదు. అందరూ కలిసే ఉన్నారు. ఓ కుటుంబంలాగా అక్కడక్కడ అభిప్రాయ భేదాలుంటే కలిసి చర్చించి లోపాలను సవరించుకుంటాం. నేను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కరి ఆలోచనలను, అభిప్రాయాలను తీసుకుంటా. అభివృద్ధిలో భాగస్వామినవుతా.
ప్రశ్న: గతంలో స్థానిక సంస్థల ప్రాధాన్యత అంటే పెద్దగా తెలిసేది కాదు. నిధులు, విధుల విషయంలో అసంతృప్తి ఉంది. మీ ప్రాథామ్యాలేమిటీ?
విఠల్: ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తా. సమస్యలను తెలుసుకుంటా. స్థానిక సంస్థల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటా. నాకు వచ్చే నిధులను సమంగా ఖర్చుచేస్తా. స్థానిక సంస్థల బలోపేతానికి అన్ని విధాలుగా కృషిచేస్తా. వాటి ప్రాధాన్యతను మరింత పెంచేలా వ్యవహరిస్తా.
ప్రశ్న: మీరు అనుకున్నట్లుగానే అఖండ విజయం సాధించారు? రేపటి నుంచి మీ ప్రణాళిక ఏమిటి?
విఠల్: ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీ కాలం జనవరి 4 వరకు ఉంది. ఆ తరువాత స్థానిక సంస్థల అభివృద్ధే ఏజెండాగా పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. నా పదవీ కాలాన్ని పారదర్శకంగా కొనసాగించాలనేదే నా ప్రత్యేక ప్రణాళిక. ఎమ్మెల్సీ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రజలు, ప్రజాప్రతినిధుల మెప్పుపొందుతా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం మరింత పకడ్బందీగా కృషిచేస్తా.
ఇదీ చూడండి: TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం