హరితహారంలో భాగంగా నాటాలనుకున్న 230 కోట్ల మొక్కల లక్ష్యాన్ని వచ్చే ఏడాది పూర్తి చేస్తామని తెలంగాణ ఆటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అధ్యక్షతన జరిగిన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశంలో... నిర్మల్ కలెక్టరేట్ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై చేపట్టాల్సిన విధివిధానాలపై కేంద్ర మంత్రి జావడేకర్ సమీక్షించారు.
అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో అడవులను పెంచడం, తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా అటవీయేతర ప్రాంతాల్లో మొక్కలు నాటడం, నదీ పరివాహక ప్రాంతాల్లో అడవుల రక్షణ, నగర వన పథకం, స్కూల్ నర్సరీ యోజన స్కీమ్, తదితర అంశాలను సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
హరితహారం ద్వారా ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలు నాటి... 72 శాతం బతికించుకోగలిగామని మంత్రి వివరించారు. ఆరో విడతలో 29 కోట్ల లక్ష్యానికి గానూ 21 కోట్లకు పైగా మొక్కలు నాటడం వల్ల... గత ఆరేళ్లలో 203 కోట్లు నాటినట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను తిరిగి తెరిచేందుకు అనుమతినివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. వివిధ శాఖల సహాకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 95 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నామని... వాటిలో 35 పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
నగర వన యోజన పథకం క్రింద 15 పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని, వాటికి అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. వివిధ ప్రాజెక్టుల కింద తీసుకున్న అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నదుల పనురుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అడవుల పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేంద్రం వద్దనున్న కంపా నిధుల నుంచి పది శాతం వినియోగానికి అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు.